

రష్యా నుంచి డీజిల్ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, ఈ ఒప్పందం అమెరికా కోసం కాకుండా ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించేందుకేనని పేర్కొన్నారు. అధిక ఇంధన ధరలతో ఒత్తిడికి గురవుతున్న అంతర్జాతీయ మార్కెట్‌కు ఉపశమనం కల్పించేందుకు రష్యా రిఫైనరీల నుంచి ఇంధన సరఫరాలను వినియోగించనున్నట్లు మీడియాతో మాట్లాడుతూ వివరించారు. అమెరికాలో నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుదల రాజకీయంగా కీలక అంశంగా మారింది. ఈ క్రమంలో రష్యా డీజిల్‌పై ఆంక్షలను 2027 ఏప్రిల్ వరకు ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించినట్లు ఆయన గతంలో వెల్లడించారు.
తొలుత మూడు లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లకు రష్యా తక్షణమే సరఫరా చేసేలా ఒప్పందం కుదిరిందని ట్రంప్ తెలిపారు. నవంబరులో మరో ఐదు లక్షల టన్నులు, ఆ తర్వాత వెంటనే అదనంగా పది లక్షల టన్నుల డీజిల్‌ను సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రష్యా రిఫైనరీల సామర్థ్యం, పరిస్థితులను బట్టి స్వల్ప వ్యవధిలో మరో 30 లక్షల టన్నుల వరకు సరఫరా చేసే అవకాశం ఉందని వివరించారు. అయితే, ఈ ఒప్పందంపై అమెరికాలో రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ధరలను నియంత్రించడం, సరఫరాలను స్థిరీకరించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యమని ఆయన చెబుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!