

సాగునీటి శాఖలో పనిచేస్తున్న ఇంజినీర్ల సీనియారిటీ, పదోన్నతులకు సంబంధించిన వివాదంలో ఏపీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వివాదాలను తెలంగాణ హైకోర్టు విచారించడం కంటే, ఆ పిటిషన్లను ఏపీ హైకోర్టులోనే విచారించడం సముచితమని కోరుతూ 2021లో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి శాఖకు చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల సీనియారిటీ జాబితాపై గతంలో వివాదం తలెత్తింది. 2019లో తెలంగాణ హైకోర్టు సంబంధిత ఉత్తర్వులను కొట్టివేసి, అన్ని జోన్లకు ఇంజినీర్ల సీనియారిటీని పునఃనిర్ధారించాలని ఆదేశించింది. అనంతరం ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ఖరారుకు చర్యలు చేపట్టగా, కొందరు ఉద్యోగులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో కొందరు ఇంజినీర్లు తెలంగాణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. రెండు హైకోర్టుల్లో విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో పిటిషన్లన్నింటినీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీనికి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో బదిలీకి ధర్మాసనం అనుమతించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!