

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ అనంతరం తిహాడ్ జైలులో కొంతకాలం గడిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె కోడలు సోనియా గాంధీ ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లేవారట. ఈ విషయాన్ని సోనియా తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో వెల్లడించారు. ఇందిరా గాంధీ సూచన మేరకు ఓసారి ఆమె కోసం మాత్రమే కాకుండా ముగ్గురు మహిళా గార్డులు, జైలులో ఉన్న ఓ విదేశీ మహిళా ఖైదీ కోసం కూడా భోజనం తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే, ఆ మహిళ ఎవరో తనకు ఆ తర్వాత తెలిసిందని, ఆమె ప్రముఖ సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ ప్రేయసి అని పేర్కొన్నారు. కానీ ఆ యువతి పేరును మాత్రం పుస్తకంలో వెల్లడించలేదు.
భారత్-వియత్నాం సంతతికి చెందిన ఛార్లెస్ శోభరాజ్ 1970వ దశకంలో ఆసియాలోని పలు దేశాల్లో హత్యలకు పాల్పడిన కేసుల్లో నిందితుడిగా నిలిచాడు. 1976 జులైలో అతడిని ముగ్గురు మహిళలతో కలిసి భారత పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అతడి ప్రేయసి మేరీ ఆండ్రీ లెక్లెర్క్ కూడా ఉన్నారు. క్యాన్సర్ బారిన పడిన ఆమెకు 1983లో కెనడాకు వెళ్లేందుకు కోర్టు అనుమతివ్వగా, మరుసటి ఏడాది ఆమె మరణించింది. 1986లో తిహాడ్ జైలు నుంచి తప్పించుకున్న శోభరాజ్ తిరిగి పట్టుబడి, 1997లో బెయిల్‌పై విడుదలయ్యాడు. 2004లో నేపాల్ కోర్టు ఓ హత్య కేసులో అతడిని దోషిగా నిర్ధారించింది. 2022లో జైలు నుంచి విడుదలైన అనంతరం ఫ్రాన్స్‌కు వెళ్లిపోయాడు. మరోవైపు, 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరా గాంధీని అరెస్ట్ చేయగా, ఆమె డిసెంబర్ 26న విడుదలయ్యారు. 1980లో ఆమె తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!