

రహదారులపై సంచరిస్తున్న వీధి పశువుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదాలను నివారించేందుకు జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వీధి పశువుల కోసం షెల్టర్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి సూచించింది. మంగళవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
రహదారుల పక్కన పశువుల కోసం షెల్టర్ల నిర్మాణానికి భూమిని సేకరించడం, నిర్మాణాలు చేపట్టడం తమ పరిధిలో లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన జస్టిస్ మెహతా.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద పలు ప్రభుత్వ రంగ సంస్థలను ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. వీధి పశువుల సమస్య పరిష్కారానికి ఎన్హెచ్ఏఐ కూడా తన వంతు సహకారం అందించాలని ధర్మాసనం సూచించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!