

భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభాన్ని కొందరు దేశీయ పారిశ్రామికవేత్తలు అడ్డుకుంటున్నారంటూ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని భారత్ అనుమతించబోదని స్పష్టం చేశారు. దేశంలో సేవలు ప్రారంభించాలనుకునే సంస్థలు నిర్దేశిత భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) రంగంలోని అన్ని సంస్థలకు ఒకే విధమైన నియంత్రణ, భద్రతా ప్రమాణాలను అమలు చేస్తామని తెలిపారు. సంస్థలకు అనుమతులు ఇచ్చే ముందు భద్రతాపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని వెల్లడించారు.
శాట్‌కామ్ స్పెక్ట్రమ్ ధరల విధానంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సింధియా తెలిపారు. స్టార్‌లింక్, జియో శాట్‌కామ్, యుటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు ఇప్పటికే లైసెన్సులు మంజూరయ్యాయని, అయితే నిర్దేశిత భద్రతా ప్రమాణాలు, ఇతర నియంత్రణపరమైన షరతులను పూర్తి చేసిన తర్వాతే సేవలు ప్రారంభించవచ్చని వివరించారు. శాట్‌కామ్ సేవలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపైనా సింధియా స్పందిస్తూ, ఈ అంశంపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని పేర్కొన్నారు. మిగిలిన నియంత్రణపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే సేవల ప్రారంభంపై స్పష్టత రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!