

నర్సంపేట మండలంలోని ముగ్ధూంపురం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు మినీ బ్యాంకులో జమ చేసిన డబ్బులు బ్యాంకు ఖాతాల్లో కనిపించకపోవడంతో భారీ మోసం జరిగినట్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో దాదాపు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పక్కదారి పట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విఘ్నేశ్వర, రాజేశ్వరి, బంజారా అనే మూడు గ్రామ స్థాయి సంఘాల పరిధిలో సుమారు 80 మహిళా సంఘాలు పనిచేస్తుండగా, పొదుపు, రుణ చెల్లింపులు, వడ్డీ నగదును క్రమం తప్పకుండా జమ చేసినప్పటికీ ఖాతాల్లో నమోదు కాలేదని సభ్యులు చెబుతున్నారు.
ఝాన్సీ మహిళా సంఘం రూ.10 లక్షల రుణం కోసం దరఖాస్తు చేయగా ఖాతాల్లో తేడాలు బయటపడ్డాయి. పరిశీలనలో సుమారు రూ.80 వేల వ్యత్యాసం గుర్తించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆరు సంఘాల లెక్కల్లో దాదాపు రూ.3 లక్షల వరకు అవకతవకలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. కొన్ని సందర్భాల్లో పూర్తి మొత్తానికి రసీదు ఇచ్చి, ఖాతాలో మాత్రం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు మాత్రమే జమ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్లుగా సరైన తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!