

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన కాల్పుల ఘటన నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా జైలులో ఉన్నప్పటికీ, అతడి అనుచరులుగా భావిస్తున్న వ్యక్తుల నేర కార్యకలాపాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ను గతంలో ఉన్న ‘10-సెల్’ బ్లాక్ నుంచి మరింత భద్రత కలిగిన ‘200 రూమ్’కు మార్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ బ్లాక్‌ను నాలుగు విభాగాలుగా విభజించారని, ఒక్కో విభాగంలో సుమారు 50 మంది ఖైదీలు ఉంటారని సమాచారం. ఒక్కో సెల్ 7.5 x 11 అడుగుల పరిమాణంలో ఉంటుందని, ఖైదీల మధ్య పరస్పర సంభాషణలను నియంత్రించేందుకు నిరంతర నిఘా ఉంటుందని కథనాలు పేర్కొన్నాయి. 2008 బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన కొందరు కూడా ఇదే బ్లాక్‌లో ఉన్నట్లు సమాచారం.
పంజాబ్‌కు చెందిన లారెన్స్ బిష్ణోయ్‌పై హత్యలు, దోపిడీలు, అక్రమ ఆయుధాలకు సంబంధించిన పలు కేసులు ఉన్నాయి. 2014లో అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయిన అతడిని పంజాబ్‌లోని వివిధ జైళ్లతో పాటు దిల్లీలోని తీహార్ జైలులోనూ నిర్బంధించారు. జైలులో ఉన్నప్పటికీ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడటం, తన అనుచరులకు సందేశాలు పంపించడం వంటి కార్యకలాపాలకు సంబంధించి గతంలో దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. 2023లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతడిని అదుపులోకి తీసుకుని సబర్మతి జైలుకు తరలించింది. ఇటీవలి కాలంలో అతడు ప్రధానంగా తన న్యాయ బృందంతోనే సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపినట్లు కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు, విదేశాల్లో ఉన్నట్లు భావిస్తున్న గోల్డీ బ్రార్, రోహిత్ గొదారా వంటి గ్యాంగ్స్టర్లతో అతడి నెట్‌వర్క్‌కు ఉన్నట్లు చెబుతున్న సంబంధాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఈ పరిణామాలు జైళ్లలో భద్రత, వ్యవస్థీకృత నేరాల నియంత్రణపై మరోసారి చర్చకు దారితీశాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!