

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా (ఎంహెచ్‌ఐ)ను అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ 120 కోట్ల యూరోలు (సుమారు రూ.13,200 కోట్లు)కు కొనుగోలు చేసింది. భారత హెల్త్‌కేర్ రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద కొనుగోలుగా ఈ ఒప్పందం నిలిచింది. ప్రస్తుతం మెడికవర్ ఇండియాలో స్వీడన్‌కు చెందిన మెడికవర్ ఏబీకి 66.1 శాతం, మిగతా 33.9 శాతం వాటా మైనారిటీ వాటాదారుల వద్ద ఉంది. ఈ మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు కేకేఆర్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ లావాదేవీలో మెడికవర్ ఏబీకి 74 కోట్ల యూరోలు (సుమారు రూ.8,140 కోట్లు) అందనున్నాయి. మిగిలిన మొత్తం మైనారిటీ వాటాదారులకు చెల్లించనున్నారు. ఈ నిధులను పోలండ్, రొమేనియా, జర్మనీల్లో తమ ఆసుపత్రుల విస్తరణకు వినియోగించనున్నట్లు మెడికవర్ ఏబీ వెల్లడించింది. అన్ని వ్యూహాత్మక అవకాశాలను పరిశీలించిన అనంతరం భారత వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్నామని సంస్థ సీఈఓ జాన్ స్టబ్బింగ్టన్ తెలిపారు. కేకేఆర్ నేతృత్వంలో భారత హెల్త్‌కేర్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!