

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా 2,367 కిలోల బరువున్న భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2.55 గంటలకు ప్రయోగం చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. తుది సమీక్షలు, అనుమతుల అనంతరం ప్రయోగ తేదీ, సమయంపై అధికారిక నిర్ణయం వెలువడనుంది.
జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 మూడు దశల్లో ప్రయాణించనుంది. షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అనంతరం రాకెట్‌ను ప్రయోగ వేదికకు తరలించారు. సెప్టెంబర్ 1న మిషన్ రెడీనెస్ రివ్యూ నిర్వహించనున్నారు. 50.9 మీటర్ల పొడవున్న ఈ రాకెట్ సుమారు 420.7 టన్నుల బరువుతో నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగం విజయవంతమైతే భారత స్వదేశీ అంతరిక్ష సాంకేతిక సామర్థ్యాలకు మరో కీలక మైలురాయిగా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!