

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలైన అల్-రిఫా, అవాలిలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా దురాక్రమణకు, తమ గగనతలాన్ని పదేపదే ఉల్లంఘించడానికీ ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో ఓ పౌర పారిశ్రామిక కేంద్రం దెబ్బతిన్నట్లు బహ్రెయిన్ అధికారులు తెలిపారు. పలు డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని, దాడుల కారణంగా చెలరేగిన భారీ మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
మరోవైపు, హర్మూజ్ జలసంధిలో శనివారం రెండు చమురు ట్యాంకర్లపై దాడులు జరిగినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఏజెన్సీ వెల్లడించింది. ఇదే ప్రాంతంలో అనుమతి లేని మార్గంలో ప్రయాణించిన మరో నౌక సముద్రంలో అమర్చిన మందుపాతరను ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు తెలిపింది. పశ్చిమాసియాలో వరుస దాడులు, సముద్ర మార్గాల్లో భద్రతాపరమైన ఘటనలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!