

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ అహింసా మార్గంతో పాటు విప్లవ భావజాలంతో పోరాడిన యువకుల్లో భగత్ సింగ్‌ది ప్రత్యేక స్థానం. 1907 సెప్టెంబర్ 28న పంజాబ్‌లోని బంగా గ్రామంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే స్వాతంత్య్ర పోరాట వాతావరణంలో పెరిగారు. తండ్రి కిషన్ సింగ్, బాబాయి అజిత్ సింగ్ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. లాహోర్ డీఏవీ పాఠశాలలో విద్యాభ్యాసం అనంతరం లాలా లజపతిరాయ్ స్థాపించిన నేషనల్ కాలేజీలో చేరిన భగత్ సింగ్ విప్లవ, సామాజిక, రాజకీయ భావజాలంపై లోతైన ఆసక్తి పెంచుకున్నారు. 1926లో నౌజవాన్ భారత్ సభను స్థాపించిన ఆయన, హిందూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎస్ఆర్ఏ)గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా జరిగిన సాండర్స్ హత్య, 1929లో బతుకేశ్వర్ దత్తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరిన ఘటన ఆయన విప్లవ ప్రస్థానంలో కీలక మలుపులుగా నిలిచాయి. అనంతరం అరెస్టై, కోర్టును తన విప్లవ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా ఉపయోగించుకున్నారు.
భగత్ సింగ్ పోరాటం కేవలం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం మాత్రమే కాదు. దోపిడీ లేని సమసమాజం, సామాజిక సమానత్వం, శాస్త్రీయ ఆలోచన వంటి అంశాలపై ఆయన బలమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జైలు జీవితంలో మార్క్స్, లెనిన్, ట్రాట్స్కీ తదితరుల రచనలు చదివిన ఆయన, “నేనెందుకు నాస్తికుడిని” అనే వ్యాసం ద్వారా తన ఆలోచనా విధానాన్ని వివరించారు. లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు మరణశిక్ష విధించగా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గాంధీ-ఇర్విన్ ఒప్పందం సమయంలో భగత్ సింగ్ ఉరిశిక్షపై గాంధీజీ పాత్రకు సంబంధించి చారిత్రక చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీశారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ ఆలోచనలు, త్యాగం భారత స్వాతంత్య్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!