

కువైట్‌లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న వనిత అనే భారతీయ మహిళ తనను తీవ్రంగా హింసిస్తున్నారని, గత రెండు నెలలుగా జీతం కూడా చెల్లించలేదని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో తాను తమిళనాడులోని కల్లకురిచి జిల్లాకు చెందినవారినని, కువైట్‌కు వచ్చి మూడు నెలలు అవుతోందని ఆమె తెలిపారు. తనను రక్షించి మాతృభూమి అయిన భారత్‌కు తీసుకురావాలని కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులను వేడుకున్నారు.
ఈ వీడియో తమిళనాడు అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వివరాలు సేకరించి వనిత కల్లకురిచి జిల్లాకు చెందినవారని గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేయగా, వనితను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని వారు అధికారులను కోరారు. తన కుమార్తెను కువైట్‌కు పంపించేందుకు ఓ ఏజెంట్ మోసం చేశాడని వనిత తల్లి ఆరోపించారు. ఇంటి పనిమనిషిగా పనిచేయాలనే ఆశతో కువైట్ వెళ్లిన తన కుమార్తె ఇప్పుడు చిత్రహింసలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వనితను భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. చీకటి గదిలో చేతులు జోడించి రక్షించాలని వేడుకుంటున్న ఆమె వీడియో అందరినీ తీవ్రంగా కలిచివేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!