

కంబదూరు మండలం నూతిమడుగుకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సాయికృష్ణ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాడిపోషణ, వ్యవసాయం ద్వారా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని సైన్‌మెరీస్ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసిన ఆయన అదే ఏడాది మణికొండలోని ఓ ప్రైవేట్ సంస్థలో యూఎస్ ట్యాక్స్ అనలిస్టుగా ఉద్యోగంలో చేరారు. కరోనా సమయంలో 2020లో స్వగ్రామానికి వచ్చిన ఆయన అప్పటి నుంచి వర్క్‌ఫ్రం హోం విధానంలో రాత్రివేళల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు సుమారు రూ.60 వేలు సంపాదిస్తున్నారు. మిగిలిన సమయాన్ని వృథా చేయకుండా కుటుంబానికి చెందిన 40 ఎకరాల భూమిలో వ్యవసాయంతోపాటు పాడిపోషణ చేపట్టారు.
పీఎంఈజీపీ పథకం కింద రూ.10 లక్షల బ్యాంకు రుణం పొందిన సాయికృష్ణ.. అదనంగా రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టి 2024లో 15 సెంట్లలో డెయిరీ ఫాం ఏర్పాటు చేశారు. షెడ్ నిర్మాణానికి రూ.9 లక్షలు, 12 హైబ్రీడ్ ఆవుల కొనుగోలుకు మరో రూ.9 లక్షలు వెచ్చించారు. ఫాం నిర్వహణ, పరిశుభ్రత కోసం ఇద్దరు కూలీలను నెలకు రూ.20 వేల చొప్పున నియమించుకున్నారు. ఆవుల నుంచి రోజుకు సుమారు 90 లీటర్ల పాలు లభిస్తుండగా.. లీటరుకు రూ.42 చొప్పున స్థానిక డెయిరీకి విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు లాభం వస్తోంది. మరోవైపు ఐదు ఎకరాల్లో టమాట, ఆరు ఎకరాల్లో వరి, నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. రోజుకు ఐదారు గంటలు పొలంలో పంటల సంరక్షణకు కేటాయిస్తున్నారు. కాలానుగుణంగా ఏడాదికి మూడు పంటలు సాగు చేస్తూ వ్యవసాయం ద్వారా సుమారు రూ.15 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబంతో కలిసి ఉంటూనే వ్యవసాయం, పాడిపోషణ ద్వారా ఆదాయం పెంచుకుంటున్న సాయికృష్ణ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!