

తన ఓటును తొలగించారంటూ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇచ్చారు. బెంగళూరులోని ఓటరు జాబితా నుంచి ఆయన పేరును శాశ్వతంగా తొలగించలేదని, ఓటరు వివరాల్లో ఉన్న చిరునామాలో ఆయన ప్రస్తుతం నివసించకపోవడంతో ‘పర్మనెంట్‌గా షిఫ్ట్ అయినవారు’ అనే కేటగిరీలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. శాంతినగర్ నియోజకవర్గంలోని ఆయన పాత చిరునామాలో అధికారులు విచారణ చేపట్టగా.. గత నాలుగేళ్లుగా ప్రకాశ్ రాజ్ అక్కడ నివసించడం లేదని స్థానికులు ధ్రువీకరించినట్లు తెలిపింది.
అదనపు జిల్లా ఎన్నికల అధికారి జగదీష్ మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్‌తో ఫోన్‌లో మాట్లాడామని, తాను ఆ అపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం నివసించడం లేదని ఆయన కూడా ధ్రువీకరించారని తెలిపారు. శాంతినగర్ నియోజకవర్గంలోని మరో ప్రాంతంలో తాను నివసిస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ చెప్పారని వెల్లడించారు. ప్రస్తుత నివాస చిరునామాతో ఫారమ్-6 సమర్పించి ఓటరు జాబితాలో తన పేరును తిరిగి నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని జగదీష్ స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!