

మురసు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ చేపట్టిన సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని, సుమారు 6 వేల నుంచి 8 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాల్లో 48 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించే లక్ష్యంతో పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అవసరమైన సిబ్బంది, యంత్రాలు, పరికరాలను ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. గతంలో అర్నబ్ తుఫాను సమయంలో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత సమర్థంగా సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తెలంగాణ, తమిళనాడు నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలు, పరికరాలను తెప్పించాలని ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి 500 మంది సిబ్బంది చేరుకున్నారని, తమిళనాడు కూడా అవసరమైన సిబ్బంది, పరికరాలను పంపేందుకు అంగీకరించిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రేపటి నుంచి తుఫాను ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకు ఒకసారి పరిస్థితిపై బులెటిన్ విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!