

ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 28 జిల్లాల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన జిల్లాల వారీ సమీక్షలను మూడు నెలల్లో పూర్తి చేశారు. ఫిబ్రవరి 12న కృష్ణా జిల్లాతో ప్రారంభమైన ఈ సమీక్షలు విశాఖపట్నం జిల్లాతో ముగిశాయి. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం పాలన, అభివృద్ధి, స్థానిక సమస్యలపై సమగ్రంగా చర్చించారు. మొత్తం 28 జిల్లాల సమీక్షల్లో వెయ్యికి పైగా సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రస్తావించగా, వాటిలో ప్రాధాన్యత ఉన్న కొన్ని పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆర్థికేతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కూడా సూచించారు.
సమీక్షల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. పనితీరు సరిగా లేని ప్రజాప్రతినిధులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం బలోపేతం కావాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల సూచనలను గౌరవించి అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశించారు. అధికారుల పనితీరును సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తూ పరిపాలనలో మరింత సమర్థత సాధించాలనే దిశగా సూచనలు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!