

మైక్రోసాఫ్ట్ సంస్థ భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని అర్హులైన ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ (VEO)ను ప్రకటించింది. సంస్థ అంతర్గత ఉద్యోగ గ్రేడింగ్ విధానంలో లెవెల్ 70, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 60,000 మంది ఉద్యోగులు ఈ ఆఫర్‌ను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు దాదాపు 23,000 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో ఎంతమంది ఈ పథకానికి అర్హులో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
భారత్‌లో అర్హులైన ఉద్యోగులు ఈ ఆఫర్‌ను ఎంచుకోవడానికి 2026 డిసెంబర్ 1 వరకు గడువు ఉంది. స్వచ్ఛందంగా సంస్థ నుంచి వైదొలిగే ఉద్యోగులకు వారు పూర్తి చేసిన ప్రతి సంవత్సరం సర్వీసుకు ఒక నెల ప్రాథమిక వేతనానికి సమానమైన మొత్తాన్ని ప్యాకేజీగా అందిస్తారు. దీనితో పాటు ఆరోగ్య బీమా, కెరీర్ ప్రణాళిక, ఉద్యోగ మార్పు సమయంలో అవసరమైన సహాయక సేవలు కూడా లభిస్తాయి.
ఉద్యోగులకు ఎగ్జిట్ ఆఫర్ ప్రకటించినప్పటికీ, భారత్‌లో పెట్టుబడుల విషయంలో మైక్రోసాఫ్ట్ తన ప్రణాళికలను కొనసాగిస్తోంది. 2029 నాటికి భారత్‌లో క్లౌడ్, కృత్రిమ మేధ (AI) మౌలిక సదుపాయాలు, నైపుణ్య శిక్షణ కోసం 20.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.95 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సంస్థ కట్టుబడి ఉందని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!