

భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లు ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నారని జేపీ మోర్గాన్ ఛేస్ సీఈవో జేమీ డిమోన్ తెలిపారు. అయితే పన్నుల నిబంధనల అమలులో స్థిరత్వం లేకపోవడం పలు సంస్థలను ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. భారత్‌లో కొన్ని డీల్స్ విషయంలో అంచనా వేసిన దానికంటే అధికంగా పన్నులు చెల్లించాల్సి వస్తోందంటూ కంపెనీలు తన దృష్టికి తీసుకొచ్చాయని డిమోన్ పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడిదారుల ఆందోళనలను తగ్గించేందుకు ప్రభుత్వం పన్నులు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో మార్పులు చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
భారత్‌లో విదేశీ కంపెనీలు పోటీ పడటానికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని డిమోన్ అన్నారు. దీని వల్ల దేశానికి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్‌లో మరింత పోటీ ఉండటం భారత్‌కు ప్రయోజనకరమని, విదేశీ సంస్థలపై అనవసరమైన నియంత్రణలు పోటీని అడ్డుకోకూడదని సూచించారు. ఇదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా మంచి అవకాశాలు ఉన్నాయని డిమోన్ పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!