

ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.5,254 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 25 శాతం వృద్ధి (రూ.4,214 కోట్లు)ని సూచిస్తోంది. స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన కూడా బ్యాంక్ నికర లాభం రూ.4,104 కోట్ల నుంచి రూ.5,155 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది.
ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా కెనరా బ్యాంక్ ఇన్ఛార్జ్ సీఈఓ, ఎండీ హర్దీప్ సింగ్ అహ్లువాలియా మాట్లాడుతూ, సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 1.13 శాతం వృద్ధితో రూ.4,104 కోట్లకు చేరిందన్నారు. అదే కాలంలో బ్యాంక్ మొత్తం గ్లోబల్ వ్యాపారం 13.23 శాతం పెరిగి రూ.27,13,594 కోట్లకు చేరుకుందని తెలిపారు. గ్లోబల్ డిపాజిట్లు 12.95 శాతం వృద్ధితో రూ.15,21,268 కోట్లుగా నమోదయ్యాయని, దేశీయ డిపాజిట్లు 11.10 శాతం పెరిగి రూ.13,97,045 కోట్లకు చేరాయని వివరించారు. రిటైల్ రుణ పోర్టుఫోలియో 31.37 శాతం వృద్ధితో రూ.2,73,395 కోట్లకు పెరిగిందని, ఇందులో హౌసింగ్ రుణ విభాగం 17.58 శాతం వృద్ధి చెంది రూ.1,21,172 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు.
ఆస్తుల నాణ్యత పరంగా చూస్తే, స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2.35 శాతం నుంచి 2.08 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 0.54 శాతం నుంచి 0.45 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ వెల్లడించింది. డిసెంబరు ముగిసే నాటికి కెనరా బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 10,066 శాఖలు, 7,048 ఏటీఎంలు ఉన్నాయి. అంతేకాకుండా లండన్, న్యూయార్క్, దుబాయ్‌తో పాటు గుజరాత్ ఐబీయూ గిఫ్ట్ సిటీలో నాలుగు విదేశీ శాఖలను కూడా బ్యాంక్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు భవేంద్రకుమార్, సునీల్ కుమార్ ఛగ్, ఎస్.కే. మజుందార్ పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!