

గూగుల్ కోట్లాది మంది వినియోగదారులకు లాభం చేకూర్చే కీలక అప్డేట్ను త్వరలో అమల్లోకి తీసుకురాబోతోంది. ఈ కొత్త మార్పుతో వినియోగదారులు తమ గూగుల్ ఖాతా లేదా డేటాను కోల్పోకుండా తమ జీమెయిల్ అడ్రస్‌ను మార్చుకునే అవకాశం పొందనున్నారు. దీనికి సంబంధించి గూగుల్ తన సపోర్ట్ పేజీలో అధికారికంగా అప్డేట్ చేసింది. “@gmail.com”కి ముందు ఉన్న మెయిల్ అడ్రస్ భాగాన్ని మార్చుకున్నా కూడా, ఖాతాలోని కాంటాక్ట్స్, ఈమెయిల్స్, డ్రైవ్ ఫైళ్లు, ఫోటోలు, సబ్స్క్రిప్షన్లు, కొనుగోళ్లు అన్నీ యథాతథంగా ఉంటాయి.
ఇప్పటి వరకు వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవాలంటే అది థర్డ్ పార్టీ డొమైన్‌కు సంబంధించినదై ఉండాలి. జీమెయిల్ ఐడీ (@gmail.com) ఉంటే కొత్త అడ్రస్ కోసం పూర్తిగా కొత్త ఖాతా తెరవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గూగుల్ ఈ పరిమితిని తొలగిస్తూ, ఖాతా సెట్టింగ్స్ నుంచే కొత్త జీమెయిల్ అడ్రస్‌ను ఎంచుకునే అవకాశం క్రమంగా అందుబాటులోకి తీసుకువస్తోంది. వినియోగదారు కొత్త జీమెయిల్ అడ్రస్‌ను ఎంచుకున్న తర్వాత, పాత అడ్రస్ ‘అలియాస్’గా కొనసాగుతుంది. పాత అడ్రస్‌కు వచ్చే మెయిల్స్ కూడా అదే ఇన్‌బాక్స్‌కు చేరతాయి. వినియోగదారులు పాత అడ్రస్తోనూ, కొత్త అడ్రస్తోనూ లాగిన్ కావచ్చు. జీమెయిల్, డ్రైవ్, యూట్యూబ్, మ్యాప్స్ వంటి సేవలకు ఉన్న యాక్సెస్‌లో ఎలాంటి మార్పు ఉండదు.
ప్రతి ఖాతాకు 12 నెలలకు ఒకసారి మాత్రమే జీమెయిల్ అడ్రస్ మార్చుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మూడు సార్లు మాత్రమే ఈ మార్పు చేసుకోవచ్చు. అంటే ఒక ఖాతాకు గరిష్టంగా నాలుగు జీమెయిల్ అడ్రస్‌లు ఉండగలవు. పాత అడ్రస్ శాశ్వతంగా అదే ఖాతాతో లింక్ అయి ఉంటుంది. అది ఇతరులు ఉపయోగించుకునే అవకాశం ఉండదు. కొత్త జీమెయిల్ అడ్రస్‌కు మారినప్పుడు కొన్ని సేవలు లేదా డివైస్లతో తాత్కాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశముందని గూగుల్ హెచ్చరించింది. క్రోమ్‌బుక్స్, గూగుల్ కన్వీనియెన్స్ సైన్-ఇన్, రిమోట్ డెస్క్‌టాప్ ఉపయోగించే వారు కొన్ని అదనపు చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. ముందుగానే డేటా బ్యాకప్ తీసుకోవాలని, కొన్ని యాప్ సెట్టింగ్స్ రీసెట్ అయ్యే అవకాశముందని కూడా గూగుల్ సూచించింది. ఇది కొత్త డివైస్‌లో లాగిన్ అయినట్లే ఉంటుందని తెలిపింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!