

రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 ఫైనల్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ పై 92 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండో టైటిల్‌పై కన్నేసిన ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. కెప్టెన్ రజత్ పాటీదార్ అజేయంగా 93 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. జాకబ్ డఫ్ఫీ, రసిక్ దార్ సలాం, భువనేశ్వర్ కుమార్‌ల ధాటికి గుజరాత్ కుప్పకూలింది. ఓటమితో గుజరాత్ ఇప్పుడు క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ విజేతతో తలపడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసి ఐపీఎల్ నాకౌట్ చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డు సృష్టించింది. విరాట్ కోహ్లీ 43, పడిక్కల్ 30 పరుగులతో మెరుపు ఆరంభం అందించగా.. అనంతరం రజత్ పటిదార్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కృనాల్ పాండ్య 43 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్లలో పటిదార్ సిక్సర్ల వర్షం కురిపించడంతో ఆర్సీబీ భారీ స్కోర్ నమోదు చేసింది. గుజరాత్ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసి వచ్చింది.

255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే తడబడింది. సాయి సుదర్శన్ హిట్ వికెట్‌గా వెనుదిరగగా.. శుభ్‌మన్ గిల్‌ను భువనేశ్వర్ కుమార్ బౌల్డ్ చేశాడు. జోస్ బట్లర్ 29 పరుగులతో కొంత పోరాడినా మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. 51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన గుజరాత్ కోలుకోలేకపోయింది. చివర్లో రాహుల్ తెవాతియా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గుజరాత్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!