

హరియాణాకు చెందిన రెజ్లర్ నితేశ్ సివాచ్ 2026 ఆసియా క్రీడల్లో పురుషుల 97 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో రజత పతకం సాధించి భారత రెజ్లింగ్‌లో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించాడు. 1962 తర్వాత ఆసియా క్రీడల్లో గ్రీకో రోమన్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ రెజ్లర్‌గా నితేశ్ నిలిచాడు. క్వార్టర్‌ఫైనల్లో తుర్క్‌మెనిస్థాన్‌కు చెందిన అమన్‌బెర్డీ అగమమ్మెడోవ్‌ను 7-1తో, సెమీఫైనల్లో మంగోలియాకు చెందిన గన్‌బాతర్ గాంకుయాగ్‌ను 9-0తో ఓడించి ఫైనల్‌కు చేరాడు. అయితే తుది పోరులో జపాన్‌కు చెందిన యూరి నకాజాటో చేతిలో 0-4తో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.
సోనిపట్ జిల్లాలోని జాగ్సీ గ్రామానికి చెందిన నితేశ్ చిన్ననాటి నుంచి రెజ్లర్ కాదు. తొలుత క్రికెట్ ఆడిన అతడు, ఆ తర్వాత కబడ్డీపైనా ఆసక్తి చూపించాడు. అయితే ఖర్కోదాలోని ప్రతాప్ స్పోర్ట్స్ స్కూల్‌లో రెజ్లింగ్ వాతావరణం అతడిని ఈ క్రీడ వైపు మళ్లించింది. టీనేజ్‌లో మోకాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకుని కొంతకాలం రెజ్లింగ్‌కు దూరమయ్యాడు. ఆ సమయంలో కుటుంబ పాల వ్యాపారంలో తండ్రికి సాయం చేస్తూ పానిపట్‌లో పాలు విక్రయించాడు. అనంతరం ఓం ప్రకాశ్ దహియా, సందీప్ శిక్షణలో మళ్లీ రెజ్లింగ్‌ను కొనసాగించాడు. 2019 ఆసియా క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో రజతం, 2022 అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, సీనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన నితేశ్.. ఇప్పుడు ఆసియా క్రీడల్లో చారిత్రక రజతంతో తన స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!