

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఘనంగా బోణీ కొట్టింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగిన ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో త్రిపురపై ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 6/52తో చెలరేగడంతో హైదరాబాద్ గెలుపు సులువైంది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 294 పరుగులు చేయగా.. త్రిపుర 134 పరుగులకే ఆలౌటైంది. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన త్రిపుర.. ఓవర్‌నైట్ స్కోరు 99/7 నుంచి మూడో రోజు మరో 21 పరుగులు మాత్రమే జోడించి 120 పరుగులకు కుప్పకూలింది. సెంతు సర్కార్ 27, శ్రీదమ్ పాల్ 25 పరుగులు చేశారు. హైదరాబాద్ కెప్టెన్ మహ్మద్ సిరాజ్ 2/19తో రాణించగా.. అభిరథ్ రెడ్డి, రుత్విక్ తలో వికెట్ తీశారు. అక్టోబర్ 18 నుంచి ప్రారంభమయ్యే తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఆంధ్రతో తలపడనుంది.
ఆంధ్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో కర్ణాటక డ్రా కోసం పోరాడుతోంది. 144 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఒక దశలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును కరుణ్ నాయర్, మన్వంత్ కుమార్ ఆదుకున్నారు. కరుణ్ 130 బంతుల్లో 81 పరుగులతో అజేయంగా నిలవగా.. మన్వంత్ 44 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. కెప్టెన్ స్మరణ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 418 పరుగులకు ఆలౌటైంది. సీరమ్ రాహుల్ 119 పరుగులతో రాణించగా.. కర్ణాటక బౌలర్ శ్రీకర్ శెట్టి 6/115తో సత్తా చాటాడు. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేసింది.
రంజీ ట్రోఫీలో ముంబయి జట్టు విజయంతో తన సీజన్‌ను ప్రారంభించింది. ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్‌లో చండీగఢ్‌పై ఇన్నింగ్స్ 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ముంబయి 429 పరుగులు చేయగా.. చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడిన చండీగఢ్ రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులకు పరిమితమైంది. అర్జున్ 62, శివమ్ బాంబ్రి 44 పరుగులతో రాణించినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు. ముంబయి బౌలర్లలో తనుష్ కొటియన్ 3/30, శామ్స్ ములాని 3/69తో రాణించగా.. తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీశాడు.
ముంబయి యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే తొడ కండర గాయంతో నాలుగు నుంచి ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. చండీగఢ్‌తో మ్యాచ్ తొలి రోజు అతడికి గాయమైంది. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సమయంలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆయుష్ ఇదే తరహా గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో సుమారు మూడు నెలలు గడిపాడు. తాజాగా మరోసారి గాయపడటంతో అతడు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది.
చత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. సెంచరీతో మెరిసిన అతడు.. చత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. జైదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియా, అంకుర్ పన్వర్ తలో రెండు వికెట్లు తీశారు. ఓవర్‌నైట్ స్కోరు 233/3తో ఆట కొనసాగించిన చత్తీస్‌గఢ్ 312 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ వర్మ 68, వికల్ప్ తివారీ 46 పరుగులు చేశారు. అనుజ్ తివారీ 72 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 392 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. చిరాగ్ జానీ 30, హర్విక్ దేశాయ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!