

తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రెండోసారి మహిళలకు చీరలను కానుకగా అందిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నారు.
మహిళల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో ఈ చీరలను ప్రత్యేకంగా రూపొందించారు. నాణ్యత, మన్నికకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలో ధరించేందుకు వీలుగా రెండు రకాల చీరలను సిద్ధం చేశారు. ఇందులో 6.30 మీటర్ల పొడవున్న 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవున్న 5 లక్షల పాలీకాటన్ చీరలు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నేత కార్మికులతోనే వీటిని తయారు చేయించారు. మహిళలకు చీరలు అందించడంతో పాటు నేత కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలందరూ చీరలు పొందేందుకు అర్హులు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేపడతారు. గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది చీరలను అందజేస్తారు. అర్హులైన మహిళలు ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలు పొందవచ్చు. పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేయనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!