

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో షాలినీ ప్రయాణం ముగిసింది. ఇంట్లో ఉన్న సమయంలో తోటి కంటెస్టెంట్లతో వాగ్వాదాలు, రోహిత్‌తో సన్నిహితంగా ఉండటం, ఆటతీరుపై వచ్చిన విమర్శలతో ఆమె తరచూ చర్చల్లో నిలిచింది. సీక్రెట్ రూంలో అవకాశం పొందిన తర్వాత కూడా తన ఆటతీరును మార్చుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరకు రెడ్ జోన్లోనే కొనసాగిన షాలినీ ఎలిమినేట్ అయింది. అనంతరం బిగ్‌బాస్ బజ్ కార్యక్రమంలో హోస్ట్ శివాజీని కలిసింది. ఇంట్లో ఆమెతో తరచూ విభేదించిన దేబ్జానీ, నీతూ, త్రిగుణ్.. షాలినీకి ఎగ్జిట్ బ్యాడ్జీలు అందించారు. ఈ నేపథ్యంలో ఆమె ఎలిమినేషన్, ఇంట్లో జరిగిన వివాదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
బజ్ ఇంటర్వ్యూలో శివాజీ షాలినీ ఆటతీరు, వెనుక మాట్లాడటం, తోటి సభ్యుల పట్ల వ్యవహరించిన తీరు, రోహిత్‌తో ఆమెకున్న అనుబంధం గురించి ప్రశ్నించారు. ఇతరులు ఏడిస్తే సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారని గతంలో షాలినీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఆమె వ్యవహారశైలిపై ప్రశ్నలు సంధించారు. సీక్రెట్ రూంలోకి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కూడా తన ఆటను ఎందుకు మార్చుకోలేకపోయిందని అడిగారు. ఈ ప్రశ్నలతో భావోద్వేగానికి గురైన షాలినీ కన్నీళ్లు పెట్టుకుంది. ముందుగానే తన ఆటతీరును మార్చుకుని ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేసింది. శివాజీతో జరిగిన ఈ సంభాషణ ఆమె బిగ్‌బాస్ ప్రయాణంలోని వివాదాలు, తీసుకున్న నిర్ణయాలు, చివర్లో కలిగిన పశ్చాత్తాపాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!