

తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆయన అభిమాన సంఘం పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం’గా మార్చడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ పరిణామంపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) స్పందించింది. ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని పార్టీ అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ తెలిపారు. తమ పార్టీ ప్రయాణం ఇతరులకు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తినిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని గుర్తుచేశారు. విజయ్ రాజకీయ ప్రయాణం వెనుక 30 ఏళ్ల కృషి ఉందని, రాజకీయ పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే, దానిని నిలబెట్టి ఎన్నికల్లో విజయం సాధించడం మరో ఎత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, ధనుష్ ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఎన్నికల సంఘంలో నమోదు చేశారంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, ధనుష్ వరుస సమావేశాలు నిర్వహించడం, అభిమాన సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో సామాజిక కార్యక్రమాలను విస్తరించడం రాజకీయ ప్రవేశంపై చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఆయన అభిమాన సంఘం ఎరుపు, తెలుపు రంగులతో ప్రత్యేక జెండాను ఆవిష్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ పరిణామాల ఆధారంగా ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని చెప్పలేం. ఆయన నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!