

మంగళగిరి నియోజకవర్గంలో వైకాపాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా సీనియర్ నేతలు దామర్ల కుబేరస్వామి, తోలేటి రవీంద్ర, దుగ్గిరాల మండలానికి చెందిన సీనియర్ నాయకుడు షేక్ అబ్దుల్ సలామ్ తదితరులు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. పసుపు కండువాలు కప్పి వారిని పార్టీలోకి లోకేశ్ ఆహ్వానించారు. ఈ పరిణామం మంగళగిరి రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ దుగ్గిరాలలో రహదారులు, షాదీఖానాలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించారని, దీంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. నాడు, నేడు, ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!