

‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ బ్లాక్ నవంబరు 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ నిరసనకు సిద్ధమవుతోంది. అయితే, దీపావళి, ధన్‌తేరస్ వంటి పండుగల నేపథ్యంలో ఈ నిరసన కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటాయని పేర్కొంటూ వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు రూ.25 వేల కోట్ల మేరకు వ్యాపారాలు ప్రభావితం అవుతాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇండీ నిరసనను వాయిదా వేయాలని కోరుతున్నాయి.
ఈ విజ్ఞప్తిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ఓట్ చోరీ 4వ నిందితుడు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి చెప్పండి. అర నిమిషం(30 సెకన్ల)లోనే నిరసనలు ఆగిపోతాయి’’ అని పేర్కొన్నారు. ‘‘ఢిల్లీలోని ప్రతి వ్యాపారి పట్ల మాకు ప్రేమ ఉంది. మీ మాట వింటాం. ప్రభుత్వం మెట్రోను మూసేసింది. రహదారులను దిగ్బధించింది. మన రాజధానిని లాక్ డౌన్ చేసింది. ఓట్ల దొంగతనం అనేది ఎవరికీ క్షేమం కాదు. మీ దుకాణాలు, మీ పొదుపు, మీ చిన్నారుల భవిష్యత్తుకు కూడా గొడ్డలి పెట్టు. అందుకే.. జ్ఞానేశ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని మోదీని కోరండి’’ అని రాహుల్ అన్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!