

అభివృద్ధి, సంక్షేమం కోసం కుల, మతాలకతీతంగా నీతి, నిజాయితీతో పనిచేసిన మహానేత ఎన్టీఆర్ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజకీయాల్లో నిబద్ధత, పట్టుదల, నిజాయితీ వంటి విలువలను నేర్పి తెలుగుజాతికి నలుదిక్కులా గౌరవాన్ని తీసుకొచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఆయన పేరుతో ఖమ్మంలో పార్కు ప్రారంభించడం అందరికీ గర్వకారణమని చెప్పారు.
ఖమ్మం నగరంలోని బ్యాంకు కాలనీలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ పార్కును ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, అన్ని మతాలు, కులాలు, రాజకీయ పార్టీలను గౌరవించిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణలో హైదరాబాద్ తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మమని తెలిపారు.
భాగ్యనగరం హైదరాబాద్ మాదిరిగానే ఖమ్మం నగరం కూడా అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నదని అన్నారు. అన్ని జాతీయ రహదారులు ఖమ్మం మీదుగానే వెళ్లుతున్నాయని, వాటి నిర్మాణం పూర్తయితే తెలంగాణలోనే ఖమ్మం అత్యంత నివాసయోగ్యమైన ప్రధాన నగరంగా మారుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!