

అదృష్టం, శకునాలు, ఆచారాలపై అతిగా ఆధారపడే ఓ వ్యక్తి జీవితంలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నం’. ప్రతి పని విషయంలోనూ అదృష్టాన్ని లెక్కలోకి తీసుకునే విక్రమ్.. పెళ్లి తర్వాత కూడా తన పద్ధతిని మార్చుకోడు. చివరకు అతడి నమ్మకాలు కుటుంబాన్నే ప్రాణాపాయ పరిస్థితుల్లోకి నెడతాయి. ఈ క్రమంలో పక్కింటి యువకుడితో జరిగిన ఘర్షణ విక్రమ్ ఆలోచనా విధానాన్ని ఎలా మార్చింది? అదృష్టాన్నే నమ్ముకుని అప్పటికే అతడు జీవితంలో ఏం కోల్పోయాడు? అనే అంశాలతో కథ సాగుతుంది. ప్రతి వారం వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ విన్ ‘కథాసుధ’లో భాగంగా ‘జాతిరత్నం’ నేడు స్ట్రీమింగ్‌కు వస్తోంది.
వర ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శశాంక్, రాశి, అన్విష, మణి కేఎల్‌కే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనుపమ చంద్ర కోడూరి, శరత్ చంద్రరెడ్డి గుర్రాల సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా చిత్రంపై ఆసక్తిని పెంచింది. కొన్నిసార్లు మన విధిని అదృష్టం కాకుండా మనం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలే నిర్దేశిస్తాయనే భావనను ప్రధానంగా చూపించారు. నమ్మకాలు జీవితంలో భాగమైనప్పటికీ అవే ప్రతి నిర్ణయాన్నీ శాసిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశాన్ని కుటుంబ కథతో ముడిపెట్టి ఈ చిత్రంలో ఆవిష్కరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!