

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ఏడు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియపై సోమవారం, అక్టోబర్ 26న హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రిజిస్ట్రార్లతో పాటు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు బాలకిస్టారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నోటిఫికేషన్ల జారీకి ముందు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గతంలో శాఖలవారీగా అమలు చేసిన రిజర్వేషన్ విధానానికి బదులుగా, సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు అనుగుణంగా ప్రతి విశ్వవిద్యాలయాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. ముందుగా మొత్తం ఖాళీలు, బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలను సమర్పించాలని, రోస్టర్‌ను ఖరారు చేసిన తర్వాతే నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులకు సూచించారు.
నియామకాల ప్రక్రియలో ఇప్పటికే విడుదల చేసిన మూడు ప్రభుత్వ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని, ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ) రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో అభ్యర్థుల విద్యా సామర్థ్యాన్ని అంచనా వేసే 30 మార్కుల పరీక్ష నిర్వహణ, పరిశీలన కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. నియామకాలు పారదర్శకంగా జరిగేలా ఉన్నతస్థాయి, సాంకేతిక, మార్గదర్శకాలు-నిబంధనల అమలు కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థుల ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో పరిష్కారం కాని సమస్యల కోసం రాష్ట్రస్థాయి అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వారం రోజుల్లో రోస్టర్ ఖరారయ్యే అవకాశం ఉండటంతో, అనంతరం సంబంధిత విశ్వవిద్యాలయాలు నోటిఫికేషన్లు విడుదల చేయవచ్చని సమాచారం. ఈ నియామకాల ప్రక్రియకు ఐటీ సంస్థగా టీసీఎస్‌ను ఎంపిక చేసినట్లు కథనం పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!