

తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు సాధారణంగా రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతాయి. అయితే ఆయన నటించిన ‘వా వాతియర్’ సినిమా మాత్రం మొదట తమిళంలోనే విడుదలైంది. ఈ సినిమా రెండు మూడు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉండగా, గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై ఒక ఫైనాన్సియర్ కోర్టులో కేసు వేయడంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. బకాయిలు చెల్లించిన తర్వాతే విడుదలకు అనుమతి లభించింది. చివరికి జనవరి 14 న తమిళనాడులో థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో సినిమా పెద్దగా ఆడలేదు.
రెండు వారాలకే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంచారు. కానీ సమస్య ఏమిటంటే, తమిళ వెర్షన్‌కు సిద్ధం చేసిన ప్రింట్‌నే తెలుగులో కూడా విడుదల చేశారు. తెరపై ఎమ్జీఆర్ ఫోటో కనిపిస్తుంటే, డైలాగ్స్‌లో మాత్రం ఎన్టీఆర్ పేరు వినిపించడం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేసింది. దీంతో తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఈ సమస్యను సరిచేసి, ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న కొత్త ప్రింట్‌ను ఈ నెల 6 నుంచి మళ్లీ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా విడుదలై చాలా కాలం గడిచిపోయిన తర్వాత మళ్లీ తీసుకురావడం ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!