

క్రైమ్, గ్యాంగ్‌వార్, రక్తపాతం, ఆధిపత్య పోరాటాల నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘అక్క’ ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌లో ఇద్దరు శక్తిమంతమైన మహిళల మధ్య జరిగే పోరాటం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 1980ల నేపథ్యంలో సాగే ఈ కథకు పెన్నూరు అనే కల్పిత ప్రాంతం వేదిక. గత 800 ఏళ్లుగా అక్కడ మహిళలే కుటుంబాలు, వ్యాపారాలు, నేర సామ్రాజ్యాలపై ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఆ వ్యవస్థలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భవాని పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనున్నారు. తన గ్యాంగ్ అండతో ప్రత్యర్థులను ఎదుర్కొంటూ తన సామ్రాజ్యాన్ని కాపాడుకునే ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండనుంది.
భవాని ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ రుద్రగా రాధికా ఆప్టే రంగంలోకి దిగుతుంది. పాత వ్యవస్థను కూల్చాలనే లక్ష్యంతో ఆమె రావడంతో పెన్నూరులో పరిస్థితులు మారిపోతాయి. ఇద్దరి మధ్య పోరు వ్యక్తిగత వైరం దాటి సంప్రదాయాలు, నమ్మకాలు, అధికారం, మనుగడ చుట్టూ సాగుతుంది. ట్రైలర్‌లోని గన్‌ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరిత ఘర్షణలు సిరీస్‌పై అంచనాలను పెంచుతున్నాయి. ధర్మరాజ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను యశ్‌రాజ్ ఫిలింస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. తన్వీ ఆజ్మీ కూడా కీలక పాత్రలో నటించారు. కీర్తి సురేశ్, రాధికా ఆప్టే తొలిసారి కలిసి నటిస్తున్న ఈ వెబ్‌సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!