

కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. హార్టికల్చర్ డీడీ సువర్ణ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇరిగేషన్ ఈఈ అధికారులు రిజర్వాయర్ నుంచి జోన్ల వారీగా బోరు మోటార్లు, పైపుల ద్వారా పంప్‌హౌస్‌లకు తరలిస్తున్న నీటిని పరిశీలించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోని 58 ఎకరాల్లో పాండురంగ చెరువును తవ్వించారని, 2016కు ముందు అక్కడ చెరువు లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 2017లో చెరువు నిర్మాణం పూర్తయ్యాక కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని మళ్లించి నింపుతున్నారని విమర్శిస్తున్నారు.
పాండురంగ చెరువు నుంచి ప్రత్యేక పైపులైన్ల ద్వారా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని మూడు ఎకరాల బావికి నీటిని పంపిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ ఇటీవల ఆరోపించారు. రైతుల పేరుతో రూ.45.54 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసి, వంద శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారాన్ని అధికార దుర్వినియోగంగా అభివర్ణించారు. ఫామ్‌హౌస్‌కు సంబంధించిన అసైన్డ్ భూములపై ఇప్పటికే సర్వే చేపట్టిన అధికారులు, తాజాగా నీటి తరలింపుపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారుల తనిఖీల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!