

కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, తర్వాత టీవీలు, ఓటీటీల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటాయి. కాలక్రమంలో అవి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాయి. ‘భగవంత్ కేసరి’ అలాంటి సినిమా కాదు. ఇది ఫ్లాప్ మూవీ కాదు. కానీ ఇందులో ఉన్న బలమైన కథ, భావోద్వేగాలకు తగ్గ స్థాయిలో బాక్సాఫీస్ ఫలితం రాలేదనే అభిప్రాయం ఉంది. అనిల్ రావిపూడి కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా చెప్పుకునే ఈ చిత్రానికి, ఆయన ఇతర సినిమాల స్థాయి వసూళ్లు రాలేదు.
అయితే, సినిమా రిలీజై రెండేళ్లకు పైగా అయిన తర్వాత, ఇప్పుడు సోషల్ మీడియాలో ‘భగవంత్ కేసరి’ కి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాను తమిళంలో ‘జన నాయగన్’ పేరుతో రీమేక్ చేశారు. ట్రైలర్ విడుదలైన తర్వాత, ఒరిజినల్ తో పోల్చుతూ బాలయ్య ఇంటెన్సిటీని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో ‘జన నాయగన్’ కారణంగా ‘భగవంత్ కేసరి’ సీన్లు, డైలాగులు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
ఇంకా విశేషమేంటంటే, ఈ సంక్రాంతికి విడుదలవుతున్న నాలుగు సినిమాలకు ‘భగవంత్ కేసరి’ తో నేరుగా లేదా పరోక్షంగా కనెక్షన్ ఉంది. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ పండుగకే ‘జన నాయగన్’ తో పోటీ పడుతోంది. అలాగే ‘భగవంత్ కేసరి’ ప్రొడ్యూసర్ సాహు గారపాటినే చిరు-అనిల్ సినిమాను ప్రొడ్యూస్ చేయడం మరో విశేషం. ఇక ‘భగవంత్ కేసరి’ లో విజ్జిగా కీలక పాత్ర చేసిన శ్రీలీల.. తమిళంలో ‘జన నాయగన్’ కు పోటీగా వస్తున్న ‘పరాశక్తి’ లో హీరోయిన్ పాత్ర చేసింది. ఆమె కూడా తన ప్రమోషన్లలో ‘జన నాయగన్’ తో పాటు ‘భగవంత్ కేసరి’ గురించి మాట్లాడుతోంది. ఇక మరో సంక్రాంతి మూవీ ‘రాజా సాబ్’ కు సంగీతం అందించింది ‘భగవంత్ కేసరి’ మ్యూజిక్ డైరెక్టర్ తమనే కావడం మరో విశేషం.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!