

తాను వదులుకున్న కొన్ని చిత్రాలు తరువాత మంచి విజయాలను సాధించాయని, వాటిని రిజెక్ట్ చేసినందుకు కొన్ని సందర్భాల్లో బాధపడ్డానని తారక్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన సినీ ప్రయాణంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ సరైనవే కాకపోవచ్చని, కొన్ని అవకాశాలు చేజారిపోయాయని ఆయన స్పష్టంచేశారు.
ఆయన మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాల క్రితం దర్శకుడు బోయపాటి శ్రీను ‘భద్ర’ కథతో తనను సంప్రదించారని తెలిపారు. అయితే ఆ సమయంలో ఆ కథ తనకు అంతగా నచ్చకపోవడంతో సినిమా చేయలేనని చెప్పానన్నారు. తర్వాత ఆ చిత్రం విడుదలై ఘన విజయాన్ని సాధించడంతో, అందులో నటించి ఉంటే బాగుండేదనే భావన కలిగిందని చెప్పారు.
అలాగే దర్శకుడు భాస్కర్ ‘బొమ్మరిల్లు’ కథను మొదట తనకే వినిపించారని తారక్ గుర్తుచేశారు. కథ ఎంతో నచ్చినా, తన అభిమానులు ఆశించే మాస్ అంశాలు అందులో లేకపోవడంతో ఆ సినిమా మాస్ ఆడియన్స్కు నచ్చదేమోనని భావించి తిరస్కరించానన్నారు. అయితే ఆ చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించడంతో, ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలు వదులుకోవడం తన కెరీర్లో ఒక మిస్సైన అవకాశం అని ఆయన పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!