

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’లోని ‘మంగళ రంగ్’ పాటపై చర్చ మొదలైంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటను అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. శ్రీరాముడు, సీతాదేవి పవిత్ర ప్రేమ, వారి ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాటలోని సంగీత శైలిపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామాయణం వంటి ఇతిహాసానికి సూఫీ ఖవ్వాలీ తరహా సంగీతం సరిపోదని అభిప్రాయపడుతున్నారు. ఈ పాటలోని ట్యూన్లు గతంలో వచ్చిన కొన్ని చిత్రాల సంగీతాన్ని గుర్తు చేస్తున్నాయని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఈ విమర్శల్లో ప్రధానంగా ఏఆర్ రెహమాన్ సంగీత శైలిపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ‘కున్ ఫయా కున్’ పాటను గుర్తు చేసేలా ‘మంగళ రంగ్’ ఉందని, పాత సంగీత శైలినే మళ్లీ ఉపయోగించారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రామాయణ ఇతివృత్తానికి అనుగుణంగా సంస్కృత సంప్రదాయాలకు దగ్గరగా ఉండే సంగీతాన్ని ఎంచుకోవాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇవి నెటిజన్ల వ్యక్తిగత అభిప్రాయాలే. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పాటపై వస్తున్న విమర్శలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!