

ప్రియదర్శి మాట్లాడుతూ-- “నేను సినిమాలో చేసే పాత్రలపై నా వ్యక్తిత్వం ప్రభావం చూపకూడదు. నటుడిగా పాత్రలోకి పూర్తిగా దిగాలి. నన్ను నేను పక్కన పెట్టినప్పుడే ప్రయోగాత్మక సినిమాలు చేయగలను. మల్లేశం, బలగం, కోర్టు వంటి మంచి పాత్రలు అందుకే వచ్చాయి. ఎవరో నా స్టైల్లో సినిమా చేద్దాం అంటారు, కానీ నాకు ప్రత్యేకమైన స్టైల్ అనేది లేదు. మీరు కొత్తగా ఏదైనా చెబితే, అదే నా స్టైల్ అవుతుంది,” అన్నారు.
ప్రియదర్శి, ఆనంది హీరో–హీరోయిన్లుగా, సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ప్రేమంటే..’. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో, రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా ఈరోజు (శుక్రవారం) విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో ప్రియదర్శి చెప్పిన విషయాలు:
⇒ “ప్రతి సినిమా రిలీజ్‌కి ముందు ఉండే టెన్షనే నాకు ఈ సినిమాకి కూడా ఉంది.. రైతు వాన కోసం ఎదురు చూసినట్టే, నేను కూడా సినిమా ఫలితం కోసం ఎదురుచూస్తుంటాను,” అన్నారు.
⇒ “మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత జీవితంలో వచ్చే మార్పులను ఈ సినిమాలో చూపించాము. పెళ్లి నేపథ్యంలో సినిమాలు చాలా వచ్చాయి, కానీ మనం ఎప్పుడు, ఎలా, ఏ టైమ్‌లైన్‌లో చెబుతున్నామన్నది ముఖ్యం. మా కథ అందరికీ రిలేటబుల్‌గా ఉంటుంది.”
⇒ “ఈ సినిమాలో నా పాత్ర కొంత కొత్తగా ఉంటుంది. ఆనంది మంచి నటిక, చాలా ప్రొఫెషనల్. సుమక్క నుంచి చాలా నేర్చుకున్నాను. నవనీత్ క్లారిటీ ఉన్న దర్శకుడు. పెళ్లిని మెచ్యూరిటీతో అర్థం చేసుకుని కథ రాశాడు. నిర్మాతలు కూడా మంచి సహకారం అందించారు.”
⇒ “విలక్షణమైన కథలు చేస్తున్నాననే గుర్తింపును ప్రేక్షకులు ఇచ్చారు. ఆ బాధ్యతతో సినిమాలు ఎంచుకుంటున్నాను. నిర్మాతలు నష్టపోకుండా ఉండటం నా బాధ్యత. డార్లింగ్ ప్రాఫిటబుల్ వెంచర్. సారంగపాణి, డార్లింగ్, మిత్రమండలి థియేటర్లలో ఆశించినంతగా ఆడకపోవడానికి వేర్వేరు కారణాలుంటాయి. కానీ నేను కాస్ట్ ఫెయిల్యూర్ హీరోను కాదు.”
⇒ “ప్రస్తుతం అసమర్థుడు, సుయోధన సినిమాల్లో నటిస్తున్నాను,” అని ప్రియదర్శి చెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!