

దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి. తీవ్ర విమర్శలు రావడంతో శివాజీ వీడియో విడుదల చేసి క్షమాపణ చెప్పారు. అయితే తాను వాడిన రెండు అభ్యంతరకర పదాల విషయంలో మాత్రమే సారీ చెబుతున్నానని, మిగతా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తర్వాత వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లగా, నోటీసులు అందుకున్న శివాజీ కమిషన్ చైర్‌పర్సన్‌ను కలిసి వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శివాజీ, తన వ్యాఖ్యలపై ఫిలిం ఇండస్ట్రీ స్పందించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. బయట ప్రజల నుంచి మద్దతు లభించిందని, కానీ ఇండస్ట్రీలోని కొందరు తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మహిళల భద్రత గురించే మాట్లాడానని, మాటల్లో పొరపాటు జరిగిందని, దానికి క్షమాపణ చెప్పినా తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా పరవాలేదని, తాను రైతు కుటుంబం నుంచి వచ్చినవాడినని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. తాను ఎవరికీ భయపడనని, ఇది పొగరు కాదు ఆత్మాభిమానమని పేర్కొంటూ, ఈ అంశాన్ని ఇక్కడితో ముగించేద్దామని శివాజీ వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!