

సంతోష్ శోభన్, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ఈ రోజు థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలైంది. అజయ్ కుమార్ రాజు పి సహ నిర్మాతగా వ్యవహరించగా, అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని విడుదల చేశారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గోకుల్ థియేటర్లో చిత్రబృందం ప్రేక్షకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంది.
ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ, “గోకుల్ థియేటర్లో నేను ఎన్నో సినిమాలు చూశాను. ఈ రోజు అదే థియేటర్లో నా సినిమా ప్రేక్షకులతో కలిసి చూడడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రభాస్ అన్న మా సినిమా చూసి అభినందించారు. ఆయనకు ‘కపుల్ ఫ్రెండ్లీ’ చాలా నచ్చింది. ప్రభాస్ అన్న ప్రశంసించగానే నేను గెలిచినట్టే అనిపించింది. ఇది పూర్తి స్థాయి ప్రేమకథ, వాలెంటైన్స్ డే సీజన్‌కు సరైన సినిమా. ప్రేక్షకులు ఇలాగే థియేటర్లలో మద్దతు కొనసాగించాలి” అన్నారు. మానస వారణాసి మాట్లాడుతూ, “మా సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ ఉత్సాహం మాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. వాలెంటైన్స్ డేను మా సినిమాతో జరుపుకుని మీ అనుభవాన్ని మీ స్నేహితులతో పంచుకోండి” అని చెప్పారు.

డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, “ప్రభాస్ మా సినిమా చూసి అభినందించారు. తనకు ‘వర్షం’ ఎలా ప్రత్యేకమో, సంతోష్ శోభన్‌కు ‘కపుల్ ఫ్రెండ్లీ’ అలాంటి చిత్రం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రశంసలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఈ సినిమాతో సంతోష్ శోభన్ 2.0 దశ ప్రారంభమవుతుంది, ఈ సంవత్సరం ఆయన పెద్ద హీరోగా నిలుస్తారు. మానస వారణాసి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. దర్శకుడు అశ్విన్ మరిన్ని తెలుగు సినిమాలు చేసి హైదరాబాద్‌లోనే కొనసాగాలి. సినిమా చూసినప్పుడే ఇది హిట్ అవుతుందని నమ్మకం కలిగింది కాబట్టి విడుదల చేశాను. ఈ వారంతా ప్రేక్షకులను కలుస్తూ మా సినిమాకు మద్దతు కోరుతాము” అన్నారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “కపుల్ ఫ్రెండ్లీని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకులు మా సినిమాను ఆస్వాదించడం మాకు ఎంతో ఆనందం. మా సినిమాను చూసి అభినందించిన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!