

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా తెరకెక్కిన సినిమా ‘దేవగుడి’. ఈ చిత్రంలో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె కీలక పాత్రలు పోషించారు. రాయలసీమ నేపథ్యంలో స్నేహం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా ఈ నెల 30 న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు, పాటలకు మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది.
దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, భగవద్గీత ఆధారంగా ఆలోచించిన కథా ప్రయాణం తనను దర్శకుడిగా మలిచిందని తెలిపారు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉన్నా, అది పరిమితంగానే చూపిస్తూ స్నేహం, ప్రేమ, కుటుంబ సంబంధాలపై కథ నడుస్తుందని చెప్పారు. చిన్ననాటి స్నేహితుల మధ్య ఏర్పడిన విభేదాలు, భావోద్వేగాలతో సినిమా ముందుకు సాగుతుందని, 11 నిమిషాల ప్రత్యేక యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు అనేక సర్ప్రైజ్ అంశాలు ఉంటాయని వెల్లడించారు. సెన్సార్ నుంచి మంచి స్పందన వచ్చిందని, రెండు కట్స్‌తో ఏ సర్టిఫికెట్ లభించిందని తెలిపారు.
నటుడు రఘు కుంచె మాట్లాడుతూ, దేవగుడి వీరారెడ్డి పాత్ర తనకు నటుడిగా మంచి పేరు తెస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పడం, రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం ఈ పాత్రకు బలం చేకూర్చాయని చెప్పారు. ఈ సినిమాలో తాను ఒక పాటను కంపోజ్ చేసి పాడినట్లు తెలిపారు. స్నేహం, ప్రేమ, పగ, కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇదని అన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!