

బెల్లం టీ ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయంగా చాలామంది ఇష్టపడతారు. అయితే టీ తయారుచేసేటప్పుడు పాలు విరిగిపోవడం తరచూ ఎదురయ్యే సమస్య. బెల్లంలో ఉండే సహజ ఆమ్లత్వం, అధిక ఉష్ణోగ్రత వద్ద పాలను ఎక్కువసేపు మరిగించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని నివారించేందుకు టీ డికాక్షన్‌ను నీటితో విడిగా తయారు చేసి, పాలను మరో పాత్రలో వేడి చేయాలి. డికాక్షన్ సిద్ధమైన తర్వాత మంటను ఆపి లేదా పూర్తిగా తగ్గించిన తర్వాత మాత్రమే బెల్లం వేసి బాగా కరిగించాలి.
బెల్లం టీ కోసం ఒక కప్పు నీటిలో టీ పొడి, కొద్దిగా తురిమిన అల్లం, రెండు యాలకులు వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించాలి. మరోవైపు అర కప్పు పాలను విడిగా వేడి చేయాలి. డికాక్షన్‌ను స్టవ్‌పై నుంచి దించిన తర్వాత ఒకటి నుంచి రెండు స్పూన్ల తురిమిన బెల్లం వేసి కరిగేలా కలపాలి. అనంతరం వేడిగా ఉన్న పాలను డికాక్షన్‌లో కలిపితే సువాసనతో కూడిన రుచికరమైన బెల్లం టీ సిద్ధమవుతుంది. మంచి నాణ్యత గల స్వచ్ఛమైన బెల్లాన్ని ఉపయోగించడం కూడా పాలు విరిగే అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!