

వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా పెరగడంతో శరీరానికి అదనపు పోషకాలు అవసరం అవుతాయి. ఈ సమయంలో డీహైడ్రేషన్, నీరసం, అలసట వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి కేవలం నీళ్లు ఎక్కువగా తాగడం మాత్రమే కాకుండా, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో పాలకూర ప్రధానమైనది. విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ వంటి పోషకాలతో నిండిన పాలకూరను వారానికి కనీసం ఒకసారి అయినా ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వేసవి వేడిని తట్టుకునే శక్తిని ఇచ్చే సహజమైన సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది.
పాలకూరలో ఐరన్ అధికంగా ఉండటంతో ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడి, సూర్యకిరణాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. విటమిన్ A, విటమిన్ C వంటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా పాలకూరలోని విటమిన్ K ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. పొటాషియం కూడా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పాలకూరను సరైన విధంగా తీసుకుంటే దాని ప్రయోజనాలు మరింతగా లభిస్తాయి. పాలకూర వంటకంపై కొద్దిగా నిమ్మరసం కలిపితే అందులోని విటమిన్ C, పాలకూరలోని ఐరన్‌ను శరీరం సులభంగా గ్రహించడానికి సహాయపడుతుంది. అయితే పాలకూరను ఎక్కువసేపు ఉడికించడం వల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి దాన్ని తేలికగా వేయించడం లేదా ఆవిరి పద్ధతిలో వండడం మంచిది. ఈ విధంగా తీసుకుంటే పాలకూరలోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!