

కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ఈ ఏడాది (2026)లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. కేజీఎఫ్(KGF) సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యష్, ఆ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే నెల (మార్చి) 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ స్వయంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ విడుదలైన తర్వాత మంచి స్పందనతో పాటు కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. కారులో రొమాన్స్ సీన్, స్మశానంలో యాక్షన్ సన్నివేశాలపై కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై సీబీఎఫ్‌సీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి.
వివాదాలు ఉన్నప్పటికీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ హక్కులు రూ. 105 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 120 కోట్లకు వెళ్లినట్లు సమాచారం. మొత్తం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులతో కలిపి వెయ్యి కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశముందని అంచనా. ఈ సినిమాకు యష్ రూ. 50 నుంచి 75 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని, లాభాల్లో వాటాతో కలిపి ఆయనకు రూ. 150 కోట్ల వరకు ఆదాయం రావచ్చని చెబుతున్నారు. ఇంతకు ముందు రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ కు గాను భారీ పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డును యష్ దాటినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే అధికారిక సమాచారం రావాల్సి ఉంది.










కామెంట్స్ (1)
Waiting for టాక్సిక్