

టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాకు ‘ఇంజి వెల్లం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి పారితోషికానికి సంబంధించి ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆయన ఒక్కో సినిమాకు సుమారు రూ.15 కోట్లు తీసుకుంటారని ప్రచారం ఉండగా, మణిరత్నం సినిమా కోసం కేవలం రూ.6 కోట్లకే అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ రెమ్యునరేషన్ వివరాలను చిత్ర బృందం అధికారికంగా ధృవీకరించలేదు.
2018లో విడుదలైన ‘చెక్క చివంత వానం’, తెలుగులో ‘నవాబ్’గా వచ్చిన చిత్రంలో కలిసి పనిచేసిన తర్వాత మణిరత్నం, విజయ్ సేతుపతి మళ్లీ జతకడుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ కావడంతో కొత్త సినిమాపై అంచనాలు పెరిగాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో వర్షంలో తడుస్తున్న జంట కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. కథాంశం, పాత్రల వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. ఈ సినిమా 2027 జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే మరిన్ని అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!