

1971 ఇండియా–పాక్ యుద్ధం తర్వాత దాదాపు బంగాళాఖాతానికి దూరంగా ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది. ఆ యుద్ధంలో భారత నౌకాదళ శక్తి ముందు పాక్ వెనుదిరగాల్సి వచ్చింది. అయితే తాజాగా పాక్ నేవీకి చెందిన సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలతో బంగాళాఖాతంలో జలాంతర్గాములను మోహరించే ఆలోచన వెలుగులోకి వచ్చింది. ఇది భారత్‌కు కొత్త వ్యూహాత్మక ఆందోళనలకు దారి తీస్తోంది.
చైనా సహకారంతో హంగోర్ శ్రేణి జలాంతర్గాములను తమ నౌకాదళంలో చేర్చుకునేందుకు పాకిస్థాన్ వేగంగా చర్యలు తీసుకుంటోంది. మొత్తం ఎనిమిది సబ్‌మెరైన్ల కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఒకటి ఇప్పటికే అందుకుంది. ఈ జలాంతర్గాములు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీతో రూపొందించబడటంతో ఎక్కువసేపు నీటిలో ఉండగలుగుతాయి. వీటి సహాయంతో అరేబియా సముద్రాన్ని దాటి బంగాళాఖాతంలో కూడా తమ సైనికశక్తిని విస్తరించవచ్చని పాక్ అధికారులు పేర్కొన్నారు. ఇది పరిస్థితులను పూర్తిగా మార్చకపోయినా, భారత్‌కు వ్యూహాత్మకంగా చికాకులు కలిగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్‌కు బంగాళాఖాతం అత్యంత కీలక ప్రాంతం. తూర్పు నౌకాదళ కమాండ్‌తో పాటు ఐఎన్‌ఎస్ వర్ష వంటి కీలక స్థావరాలు ఇక్కడే ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఇదే ప్రధాన మార్గం. మరోవైపు 2024 తర్వాత పాకిస్థాన్–బంగ్లాదేశ్ సంబంధాలు బలపడటం ఈ పరిణామాలకు కొత్త కోణం తీసుకొచ్చింది. అయినప్పటికీ, విమానవాహక నౌకలు, అణు జలాంతర్గాములతో భారత్ నౌకాదళం బలంగా ఉండటంతో పాక్‌కు వ్యూహాత్మక ఆధిక్యం సాధించడం సులభం కాదు. అయినా ఈ ప్రాంతంలో పాక్ కదలికలు భారత్‌ను అప్రమత్తంగా ఉంచే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!