

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భద్రతకు సంబంధించి గతంలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తుచేసుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ, అప్పట్లో ఉద్దేశపూర్వకంగానే ఆయన భద్రతను తగ్గించారని ఆరోపించారు. ఈ విషయాలను తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో జరిగిన సంభాషణలో ప్రస్తావించారు. ఆ సంభాషణకు సంబంధించిన వివరాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. 1991 మార్చిలో రాజీవ్ గాంధీ బిహార్‌లో ఓపెన్ జీపులో పర్యటిస్తున్న సమయంలో కొందరు ఆయనపై రాళ్లు రువ్వారని, నిరసనలతో పర్యటనకు ఆటంకం కలిగించారని సోనియా గుర్తుచేసుకున్నారు.
ఆ ఘటన సమయంలో రాజీవ్‌తో పాటు ఉన్న రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా రాళ్ల దాడిని, నిరసనలను చూశారని సోనియా తెలిపారు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత తన తండ్రి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాహుల్ కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. కుటుంబమంతా తీవ్ర భయాందోళనకు గురైనా, అప్పటి ప్రభుత్వం రాజీవ్ భద్రతను పెంచలేదని ఆమె ఆరోపించారు. ఆ ఘటన జరిగిన కొన్ని నెలలకే రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారని గుర్తుచేశారు. ఇదే సంభాషణలో 1968లో ఇటలీ నుంచి భారత్‌కు వచ్చిన తొలినాళ్ల అనుభవాలను కూడా సోనియా పంచుకున్నారు. దేశంలోని పేదరికాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. తన తల్లి ఆత్మకథలో కుటుంబం గురించి 500కుపైగా పేజీలు రాసినా, చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!