

అతి తీవ్ర తుపాను ‘అర్నబ్’ ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ప్రచండ గాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాత్రి 10 గంటల వరకు విశాఖపట్నంలో 192.89 మి.మీ., విజయనగరం జిల్లా కొత్తవలసలో 162.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో 63 రైళ్లను రద్దు చేయగా, మరో 15 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. విశాఖ జిల్లాలో 160 ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. తుపాను తీవ్రత పెరగడంతో విశాఖతోపాటు పలు జిల్లాల్లో రాత్రి ప్రయాణాలపై ఆంక్షలు విధించారు.
భారత వాతావరణశాఖ అంచనా ప్రకారం తుపాను వాయవ్య దిశగా కదులుతూ బుధవారం తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ సమయంలో గంటకు 125–135 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని అంచనా వేశారు. విశాఖలో చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో రహదారులు నీటమునిగాయి. బూర్జ మండలంలోని నదీతీర గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉప్పాడ సమీపంలోని కొత్తపట్నం వద్ద భారీ అలల ధాటికి రక్షణ గోడ దెబ్బతింది. సముద్రపు అలల ఉద్ధృతితో ఆరుగురు బైకర్లు స్వల్పంగా గాయపడ్డారు. విశాఖలోని మంగళంపాలెంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి 65 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!