

ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్తులో కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీకి నిమ్మల కూడా హాజరయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టులో సివిల్ పనులు 88 శాతం, భూసేకరణ, పునరావాస పనులు 64 శాతం పూర్తయ్యాయని, మొత్తం భౌతిక పురోగతి 83 శాతానికి చేరిందని వివరించారు.
పోలవరం రెండో దశలో భూసేకరణ, పునరావాసం తదితర అవసరాల కోసం సుమారు రూ.42,500 కోట్ల నిధులు అవసరమని, వాటిని విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిల్వ చేయడంతో పాటు, రెండో దశలో 45.72 మీటర్ల కాంటూరు వరకు ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందన్నారు. అమరావతి–ఖరగ్‌పూర్ ఆరు వరుసల ఆర్థిక కారిడార్‌ను పోలవరం స్పిల్‌వేకు సమీపంగా తీసుకురావాలని, స్పిల్‌వేను చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలని కోరినట్లు చెప్పారు. ప్రాజెక్టు పరిధిలోని సుమారు 9,900 ఎకరాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం మీదుగా కాకినాడ వరకు జాతీయ జలమార్గాన్ని ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!