

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండలో రెవెన్యూ భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల సందర్భంగా చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ప్రాథమిక నివేదికలను పరిశీలించిన అనంతరం, నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత మైనింగ్ సంస్థపై జరిమానాలు విధించడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మైనింగ్ ప్రభావంతో శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం మరియు సహజ జలధారలకు ఎలాంటి నష్టం కలగకుండా తక్షణ సంరక్షణ చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. జలధారల రంగు మార్పు, నీటి ప్రవాహంపై అధ్యయనం చేసేందుకు జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలను ఆహ్వానించాలని, పర్యావరణ పునరుద్ధరణ బాధ్యతను కూడా మైనింగ్ సంస్థకే అప్పగించాలని పేర్కొన్నారు. అలాగే పంచదార్ల కొండ పరిసరాలను 'నో మైనింగ్ జోన్'గా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచిస్తూ, సంబంధిత సంస్థకు మంజూరైన పర్యావరణ, స్థాపన, నిర్వహణ అనుమతులను తక్షణమే రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!